జిల్లాలోని ఇతర మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు..
కార్యాలయ సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు..
పలు విభాగాల్లో అవినీతి ఆరోపణలపై దాడులు..
టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి..
రెవెన్యూ శాఖలో అక్రమాలపై విచారణ..
శానిటేషన్ విభాగంలో అవినీతి ఆరోపణలు..
గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ చర్యలు..
కీలక పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు..
రణం న్యూస్ జగిత్యాల : ఏప్రిల్7
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అకస్మాత్తుగా జరిగిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) తనిఖీలు సంచలనం రేపాయి. మద్యహ్మం వేళల్లోనే కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు, అన్ని విభాగాల్లో సమగ్ర తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు పరిశీలించారు. ముఖ్యంగా కమిషనర్ కార్యాలయం, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.తనిఖీల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద సమాచారంపై పరిశీలన ప్రారంభించారు. గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, అనుమతుల మంజూరులో అక్రమాలు, భూవినియోగ మార్పులలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం.
అప్రమత్తమైన జిల్లాలోని మున్సిపల్ అధికారులు:-
ఈ పరిణామంతో జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఆందోళన వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా తనిఖీలు జరగవచ్చనే భయంతో కొంతమంది అధికారులు అప్రమత్తంగా మారారు. పలు కార్యాలయాల్లో ఫైళ్ల సర్దుబాటు, రికార్డుల పునఃపరిశీలన జరుగుతున్నట్టు సమాచారం.ఏసీబీ అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దాడులు మున్సిపల్ వ్యవస్థలో పారదర్శకత పెంపుకు దోహదపడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనకు ఇలాంటి చర్యలు కొనసాగాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి.

