రాష్ట్ర వెలమసంఘం అధ్యక్షులు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
పరిశీలకులు రుద్ర సంతోష్ లైవ్ డెమోతో శిక్షణ….
రణం న్యూస్ కోరుట్ల, జూన్ 12: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం శుక్రవారం కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పరిశీలకులు రుద్ర సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు. వారు బీఎల్ఏలకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సవివరంగా అవగాహన కల్పించారు.
బీఎల్ఏలకు ప్రత్యేక కిట్ల పంపిణీ…..

ఈ సందర్భంగా పీసీసీ అందజేసిన ప్రత్యేక సమగ్ర సవరణ కిట్లను బీఎల్ఏలకు పంపిణీ చేశారు. ప్రతి బీఎల్ఏ వద్ద ఈ కిట్లు తప్పనిసరిగా ఉండాలని నేతలు సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎదురయ్యే అంశాలపై అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేలా పనిచేయాలని కోరారు.
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం..అనంతరం మాట్లాడిన నాయకులు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాల్లో లక్షలాది మంది ఓట్లు తొలగింపుకు గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
పరిశీలకులు రుద్ర సంతోష్ లైవ్ డెమోతో శిక్షణ….

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పరిశీలకులు రుద్ర సంతోష్ లైవ్ డెమో ద్వారా బీఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, కొత్త ఓటర్ల చేర్పు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై ప్రాక్టికల్‌గా వివరిస్తూ అవగాహన కల్పించారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీసీసీ జాయింట్ సెక్రటరీ బండ శంకర్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైసోద్దీన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన వివిధ హోదాల కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర కీలకం”
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా స్వచ్ఛత అత్యంత ముఖ్యమని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

