రణం న్యూస్ కోరుట్ల:ఏప్రిల్21,
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ సమావేశానికి ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో గడి బురుజులు, చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు అక్రమ భూమి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో సుమారు 5000 గజాల భూమికి అక్రమంగా హౌస్ నెంబర్ లు కేటాయించారని ఆరోపిస్తూ, దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. అనుమతులు లేకుండా భూమిని వి.ఎల్.టి చేసి అక్రమార్కులకు అప్పగించడంలో మున్సిపల్ కమిషనర్ , సిబ్బంది పాత్ర ఉందని ఆరోపించారు.

ఈ అంశంపై పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించిన బీజేపీ నేతలు, బాధ్యులపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో కూడా బీజేపీ కౌన్సిలర్లు గడి బురుజులు, గ్రామ కంఠ ఆబాది కాళీ భూములను రక్షించాలని అధికారులను, మున్సిపల్ చైర్మన్‌ను కోరారు.
అయితే, ఈ సమస్యలపై అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, మున్సిపల్ ముట్టడి సహా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే అన్యాక్రాంతమైన భూములపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు తిరుమల వాసు, రుద్ర సుజాత, కళాల రాధా, సాయి చందు, సొరుపాక రమేష్, రమాదేవి, గుగ్లవత్ శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, ఎర్ర రాజేందర్, మాజీ కౌన్సిలర్లు మాడవేణి నరేష్, పెండం గణేష్, తులసి కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు మ్యాకల గణేష్, గుద్దేటి రాజేందర్, ఉరుమడ్ల బ్రహ్మం, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, యువ మోర్చా అధ్యక్షులు కలల సాయిచంద్, దమ్మ సంతోష్, రాగంశెట్టి సాయికృష్ణ, తైదాల ప్రశాంత్, బల్క ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

