ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్..
‘కలెక్టర్ ఆదేశాలు’ అంటూ కొత్తడ్రామా?
ప్రభుత్వ పథకాలనే అబాసు పాలు చేస్తున్న అధికారి ….
ఈ కమీషనర్ తీరు ఆధినుండి వివాదాస్పదమే..
రణం న్యూస్ కోరుట్ల: మార్చి27
(ఎడిటర్ ఆకుల మల్లికార్జున్)
కోరుట్ల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. పరిపాలనలో చట్టబద్ధత, సమానత్వం,ప్రజల హక్కులు అన్న అంశాలను పక్కనబెట్టి, “అత్యుత్సాహం”తో ముందుకెళ్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఒక్కో అంశం లోతుగా పరిశీలిస్తే, పరిస్థితి ఎంత సంక్లిష్టంగా మారిందో స్పష్టమవుతోంది.
కొత్త రూల్స్ పేరిట ఒత్తిడి తెస్తున్న కమీషనర్..
మున్సిపల్ పన్నుల వసూళ్లను పెంచడం అవసరమే అయినా, దానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కానీ కోరుట్లలో కమిషనర్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రజలపై నేరుగా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా, పారదర్శకత లేకుండా అమలు చేయడం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది.
ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్.. కమీషనర్ పరిధికి మించి ప్రవర్తన
ఇంటి పన్ను బకాయిల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. విద్యుత్ అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించిన సేవ. దానిని వసూళ్ల సాధనంగా ఉపయోగించడం ప్రజల హక్కులను హరించడం కాదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిని దాటి విద్యుత్ శాఖ పనుల్లో జోక్యం చేసుకోవడం అధికారి పరిధికి మించింది గా భావిస్తున్నారు
‘కలెక్టర్ ఆదేశాలు’ అంటూ కొత్తడ్రామా?
ఈ చర్యలు కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తున్నానని చెప్తున్నప్పటికి, స్పష్టమైన పత్రాలు లేకపోవడం పలు అనుమానాలను మరింత పెంచుతోంది. నిజంగా ఉన్నతాధికారుల నిర్ణయమా? లేక స్థానికంగా కమీషనర్ సృష్టించిన “కొత్తడ్రామా”నే? అని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది
ప్రభుత్వ పతకాలనే అబాసు పాలు చేస్తున్న అధికారి ….
ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఒకవైపు ఉంటే, ఇలాంటి కఠిన చర్యలు వాటి అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఇచ్చిన హామీలు, అమలులో ఇలాంటి నిర్ణయాలతో బలహీనమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గృహజ్యోతి పథకం అర్హుల పరిస్థితి ఏమిటి?
ఉచిత సబ్సిడీ విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అర్హులపై కూడా ఇదే చర్యలు అమలు అయితే, అది ప్రభుత్వ హామీలకు విరుద్ధం అవుతుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు రెండు వైపులా నలిగిపోతున్నారనే భావన బలపడుతోంది.
సొంతంగా జీవోలు తెస్తున్న కమీషనర్
ప్రభుత్వం జారీ చేయాల్సిన జీవోలు లేకుండానే, కమిషనర్ స్వయంగా కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది అధికార దుర్వినియోగం అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తుంది.
విద్యుత్ అధికారులపై విమర్శలు
కమిషనర్ ఆదేశాలతో పలువురి ఇళ్లలో కరెంట్ కట్ చేయడం, విద్యుత్ శాఖ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. తమ శాఖ నియమాలను పక్కనబెట్టి ఇతర శాఖ ఒత్తిడికి లోనై పనిచేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సామాన్యులకు వేధింపులు… బలిసినవారికి మినహాయింపులా?
లక్షల రూపాయల బకాయిలు ఉన్న ధనవంతులకు రూల్స్ అమలు అవుతున్నాయా? లేక సామాన్య ప్రజలపైనే కఠినంగా అమలు అవుతున్నాయా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది. ఒకే చట్టం అందరికీ సమానంగా ఉండాలనే డిమాండ్ బలపడుతోంది.
ఈ కమీషనర్ తీరు ఆధినుండి వివాదాస్పదమే..

కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ పనితీరు ఆది నుంచే వివాదాస్పదంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్లు పిలవకుండానే లక్షల రూపాయల పనులు చేయించారని, అనంతరం నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలిచినట్లు విమర్శలు ఉన్నాయి.
పనులు పూర్తయ్యాక టెండర్ ప్రక్రియ చేపట్టడం పారదర్శకతకు విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇక ప్యాచ్ వర్కుల పేరుతో అనుభవం లేని పారిశుధ్య కార్మికులతో పనులు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో పనుల నాణ్యత దెబ్బతినడంతో పాటు లక్షల రూపాయల ప్రజాధనం వృథా అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యుడైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

