ఇరవై ఏళ్ళు దాటినా. పర్మినెంట్ కానీ ఉద్యోగాలు….
మూడేళ్లు గా రాని ఫీల్డ్ ట్రావెల్లింగ్ బిల్లులు..
నిరాశతో ఉద్యోగుల బలవన్మరణాలు..
రణం న్యూస్ డెస్క్: మార్చి30
తెలంగాణలోని ఎన్టీఈపి (టీబీ) క్షయ వ్యాధి నియంత్రణ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ, వారి జీవితాల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు. 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నా, ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగడం వారి భవిష్యత్తుపై అనిశ్చితిని మరింత పెంచుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే విధంగా పనిచేసిన సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పిస్తుండగా, తెలంగాణలో మాత్రం ఆ అవకాశం దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అవసరాలకు చాలని జీతాలు…
ఈ కాంట్రాక్ట్ సిబ్బందికి అందుతున్న జీతాలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, అవి కూడా సమయానికి అందడం లేదు. కుటుంబాన్ని పోషించేందుకు సరిపోని ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు కలిపి వారి జీవితాన్ని భారంగా మార్చేశాయి. మూడు సంవత్సరాలుగా ఫీల్డ్ టూర్ ట్రావెలింగ్ బిల్లులు కూడా చెల్లించకపోవడం వల్ల అప్పుల పాలై జీవితం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగ భద్రత కరువు
మూడు సంవత్సరాలుగా రాని ఫీల్డ్ ట్రావెల్లింగ్ బిల్లులు
ఉద్యోగ భద్రత లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోతామో అనే భయంతో పని చేయాల్సి వస్తోంది. సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ, సరైన గుర్తింపు లేకపోవడం సిబ్బందిలో నిరుత్సాహాన్ని పెంచుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, హామీలు వినిపిస్తున్నా, అమలు మాత్రం కనిపించకపోవడం బాధాకరం.
ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలి….
ఈ నేపథ్యంలో, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కనీస వేతనాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. లేకపోతే, వారి జీవితాలు మరింత కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు పెరుగక ఉద్యోగుల ఆత్మహత్యలు
టీబీ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల దుస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఉద్యోగ భద్రత లేకపోవడం, పర్మినెంట్ చేయకపోవడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.
నెలల తరబడి జీతాలు ఆలస్యంగా రావడం, వచ్చినా చాలీచాలని వేతనాలు ఉండటం జీవనాన్ని భారంగా మార్చింది.
ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో కొందరు ఉద్యోగులు తీవ్ర నిరాశలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కలచివేస్తున్నాయి.
ప్రాణాలను కాపాడే ఆరోగ్య విభాగంలో పనిచేసే వారే తమ ప్రాణాలు తీసుకునే పరిస్థితిఏర్పడింది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను పర్మినెంట్ చేసి, సమయానికి సరిపడా జీతాలు చెల్లించాలని డిమాండ్లువెల్లువెత్తుతున్నాయి.

