*కమీషనర్‌పై సోషల్ మీడియా లో అవినీతి ఆరోపణలు వైరల్*
*గడి బురుజులకు వీలునామా పేపర్లతో “వి ఎల్ టి” నంబర్లు*
*సామాన్యులకు సవాలక్ష రూల్స్*
*మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విధులకు రావద్దంటూ బెదిరింపులు…*
*రణం న్యూస్ కోరుట్ల:* ఏప్రిల్16

కోరుట్ల మున్సిపాలిటీలో కమీషనర్ రవీందర్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు సాధారణ పనుల కోసం కార్యాలయానికి వెళ్తే అనేక నియమాలు, నిబంధనలు చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారని, అయితే ముడుపులు ఇచ్చే వారికి మాత్రం పనులు సులభంగా పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమీషనర్ కార్యాచరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*అక్రమ వెంచర్ లకు అండగా అంటూ…*
ఇక అక్రమ వెంచర్లకు అండగా నిలుస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డబ్బులు చెల్లించిన వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మిగతా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మున్సిపాలిటీ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
*మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను బలి చేశారంటూ ఆరోపణలు…*
అంతేకాకుండా, ఆర్ఐగా పనిచేస్తున్న ఒక ఉద్యోగితో గడి బురుజుల విషయంలో వీలునామా పత్రాలపై “వీఎల్టి” నంబర్ వేయించి అతనిపై ఒత్తిడి తెచ్చారని, తద్వారా ఆ ఉద్యోగిని విధులకు హాజరు కాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘటనపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
*ఆరోపణల పై ఉన్నతాధికారులు విచారణ జరపాలి*
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు కమీషనర్ రవీందర్ నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ అంశం తీవ్రంగా మారడంతోఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజానిజాలు వెలికితీసి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వ్యవహారం కోరుట్ల మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది.

