కొత్త జిల్లాలు ఏర్పడిన తీరని కష్టాలు
సొంతజిల్లాలకు వెళ్లలేని దుస్థితి….
చాలీ చాలని.. సమయానికి రాని వేతనాలు…
పట్టించుకోని ప్రభుత్వాలు
రణం న్యూస్ డెస్క్: మార్చి28
(ఎడిటర్ ఆకుల మల్లికార్జున్)
ఉమ్మడి జిల్లాల నీడలో ఉద్యోగం దొరికినా… కొత్త జిల్లాల గీతలు తమ జీవితాన్ని చీల్చేశాయి…
సొంత ఊరు దూరమై, కుటుంబం కన్నీటి గుండెగా మారింది….చాలీచాలని జీతం… అది సమయానికి రాని దుస్థితి…చేతిలో పని ఉన్నా… గుండెల్లో నిస్సహాయతే మిగిలిందిప్రభుత్వం చిన్న చూపు చూస్తుండటంతో, బాధలే తోడుగామారాయి..కష్టాలు చెప్పుకోలేని మౌన రోదనలు గా మారాయి.దయ చూపే దిశగా ఒక అడుగు వేయాలి.అదే మా జీవితానికి వెలుగు చూపాలి అంటూ కాంట్రాక్ట్ ఔట్ సోర్చింగ్ ఉద్యోగుల ఆత్మగోషా….
స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడి ఉమ్మడి జిల్లాలున్నా సమయంలో కాంట్రాక్ట్, పొరుగుసేవల ఉద్యోగులుగా నియమితులైన వేలాది మంది కార్మికులు నేడు కొత్త జిల్లాల ఏర్పాటుతో అనిశ్చితి అంధకారంలోకి నెట్టబడ్డారు. ప్రభుత్వ పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, వీరి జీవితాల్లో మాత్రం సంక్షోభాన్ని మిగిల్చింది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో సేవలందించిన వీరు, ఇప్పుడు తమ సొంత జిల్లాల్లోకి వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకుని కుటుంబాలకు దూరంగా బాధలు పడుతున్నారు.
చాలీ చాలని.. సమయానికి రాని వేతనాలు…
ఇప్పటికే చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న ఈ ఉద్యోగులకు వేతనాలు కూడా సమయానికి అందకపోవడం మరింత కష్టాలను మోపుతోంది. నెలల తరబడి జీతాలు నిలిచిపోవడం వల్ల ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రోజువారీ ఖర్చులు అన్నీ భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ సేవలలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వీరి పరిస్థితి మాత్రం నిర్లక్ష్యానికి గురవుతుండటం బాధాకరం.
కొత్త జిల్లాలు ఏర్పడినా సొంతజిల్లాలకు వెళ్లలేని దుస్థితి…
కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానిక అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశించిన ప్రజలకు, అదే సమయంలో ఉద్యోగుల జీవితాల్లో ఏర్పడిన ఈ అసమానతలు పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. ఉద్యోగ భద్రత లేకుండా, బదిలీలపై స్పష్టత లేకుండా, కనీస వేతన భరోసా లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి వారి మానసిక స్థితిని దెబ్బతీస్తోంది.
సమస్యలు పరిష్కరించాలి…
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, కాంట్రాక్ట్, పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సొంత జిల్లాలకు బదిలీ సౌకర్యం కల్పించడం, సమయానికి వేతనాలు చెల్లించడం, కనీస భద్రతా హామీలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవడం అత్యవసరం. వారి కష్టాలను అర్థం చేసుకుని మానవత్వంతో ముందడుగు వేయాల్సిన సమయం ఇది.
ఉద్యోగుల సంక్షేమం పై దృష్టి సారించాలి..
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే, ముందుగా ఆ లక్ష్యాలను సాధించే ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలి. లేకపోతే పరిపాలనా మార్పులు కాగితం మీదే మిగిలిపోతాయి, కానీ వాటి భారాన్ని మోసేది మాత్రం ఈ నిరుపేద ఉద్యోగులే.

