పూడ్చని ఎర్తింగ్ గుంతలు.. తెగిపడుతున్న విద్యుత్ తీగలు..
ప్రమాదాల మధ్య ప్రజా జీవనం…
చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు
రణం న్యూస్ కోరుట్ల: మే 8,
కోరుట్ల మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ఉండటం, స్తంభాలు వంగిపోవడం, ఎర్తింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి సమస్యలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, రైతులు, పశువుల కాపరులు ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామాల్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం రోజురోజుకూ ప్రమాదాలకు దారితీస్తోంది. ఒకవైపు ఎర్తింగ్ పనుల కోసం తవ్విన గుంతలను నెలల తరబడి పూడ్చకుండా వదిలేయడం, మరోవైపు గాలి వానల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి పశువుల ప్రాణాలు బలవుతున్న ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు మాత్రం ఘటనలు జరిగిన తర్వాత మాత్రమే స్పందిస్తూ చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరు నెలలుగా కల్లూరు గ్రామంలో ప్రమాదకరంగా ఎర్తింగ్ గుంతలు

కల్లూరు గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ఎర్తింగ్ పనుల పేరుతో ఆరు నెలల క్రితం పలు ప్రాంతాల్లో గుంతలు తవ్వించారు. అయితే పనులు పూర్తయిన తర్వాత వాటిని పూడ్చడం పూర్తిగా మరిచిపోయారు.రాత్రి వేళల్లో వెలుతురు లేక గుంతలు కనిపించక పలువురు జారి పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని,పలు మూగజీవాలు కుక్కలు గేదెలు చనిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. “ప్రమాదం జరిగాక స్పందించడం కాదు.. ముందే చర్యలు తీసుకోవాలి” అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మాదాపూర్లో విద్యుత్ తీగల బీభత్సం

ఇక మాదాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన గాలి వానకు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలాల సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలను తాకి రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదె ప్రాణాపాయం నుంచి బయటపడింది. పశువులను కోల్పోయిన రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు పాతబడిపోయినా, తీగలు వేలాడుతున్నా పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గాలి వానల సమయంలో విద్యుత్ సరఫరా లైన్లు తరచూ ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు.

బాద్యులపై చర్యలు తీసుకోవాలి….
విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని, శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.కల్లూరు గ్రామంలోని ఎర్తింగ్ గుంతలను తక్షణమే పూడ్చాలని, మాదాపూర్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలను వెంటనే మార్చి గ్రామాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు.

