గ్యాస్ సిలిండర్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు
చిన్న వారిపై కఠినం.. బడా బాబులపై కనికరం.ఇది అధికారుల తీరు…
చిన్న చితకా హోటల్ ల పై దాడులు… బడబడారెస్టారెంట్లు వదిలేశారు …
కానరాని అధికారుల పర్యవేక్షణ
రణం న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 13,
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
కోరుట్లలో గ్యాస్ వినియోగదారుల ఆవేదన రోజురోజుకూ పెరుగుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు సౌకర్యవంతంగా గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్యాస్ ఏజన్సీలను కేటాయించినప్పటికీ, అమలు చేసే స్థాయిలో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా “వివాన్ ఇండియన్ గ్యాస్” ఏజన్సీ వారి వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది
సుమారు 15 రోజులుగా ఏజన్సీ కార్యాలయం మూతపడినట్లుగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయినట్లు మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తున్నప్పటికీ, వాస్తవంగా సిలిండర్ మాత్రం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో రోజువారీ వంట అవసరాలు కూడా పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని నిరసన…
ఇదిలా ఉండగా, వినియోగదారులకు సరఫరా చేయాల్సిన గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు మరింత తీవ్రమవుతున్నాయి. “సందేశాల్లో డెలివరీ చూపించి, గ్యాస్‌ను మరెక్కడో అమ్ముతున్నారా?” అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కానరాని అధికారుల పర్యవేక్షణ….
స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని ఏజన్సీపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాల సరఫరాలో ఇలాంటి నిర్లక్ష్యం వీడి వెంటనే సమస్యను పరిష్కరించి, వినియోగదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చిన్న చిన్న హోటల్ ల పై దాడులు..బడా బడా రెస్టారెంట్లు వదిలేశారు …
చిన్న వారిపై కఠినం.. బడా బాబులపై కనికరం.. ఇది అధికారుల తీరు…
ఇటీవల నిర్వహించిన తనిఖీలలో పెద్ద రెస్టారెంట్లు, పెద్దవారి హోటల్ లు టిఫిన్ సెంటర్లు పక్కనబెట్టి, చిన్న చిన్న హోటళ్లలో మాత్రమే సిలిండర్లను పట్టుకుని “తుతు మంత్రంగా” తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “చిన్న వారిపై కఠినంగా, పెద్దలపై కనికరం ఎందుకు?” అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి పెద్ద స్థాయిలో గ్యాస్ వినియోగం జరిగే రెస్టారెంట్లు, కమర్షియల్ యూనిట్లలో పరిశీలించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అలాంటి చోట్ల తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్న వ్యాపారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, కేవలం తనిఖీలు చేసామా అంటే చేసాం అని“మమ” అనిపించుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారం మొత్తం చూస్తే గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణవ్ అవసరమని స్థానికులు కోరుతున్నారు. బాధిత వినియోగదారులకు న్యాయం చేయడమే కాకుండా, సరఫరా వ్యవస్థ సక్రమంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు.

