అధికారిక సమయం ముగిశాక… అనధికార సమావేశాలు..
అధికారానికి అంధకారం కవచం..
పర్యవేక్షణ పేరుతో …రహస్య పన్నాగాలు…
రణం న్యూస్ కోరుట్ల: ఏప్రిల్11
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
కోరుట్ల పట్టణంలో ఒక ప్రధాన ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పగటి వేళల్లో సాధారణ పరిపాలన జరుగుతున్నట్టే కనిపిస్తున్నా… అసలు కథ మాత్రం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ప్రారంభమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పగటి పూటనే నియమాలు..
అధికారానికి అంధకారం కవచమైతే… అవినీతి ఆడబిడ్డలా విర్రవీగుతుంది… అన్నట్లుగా, కార్యాలయ సమయం ముగిసిన తరువాత ఒక ప్రధాన అధికారి, ఒక ముఖ్య సెక్షన్ అధికారి ఇద్దరు కలిసి రాత్రివేళల్లో కార్యాలయంలోనే గోప్య సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలు సాధారణ పరిపాలనకు సంబంధించినవి కావని, భూ వ్యాపారులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులతో బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పట్టణంలో విలువైన భూముల వ్యవహారాలు, అనుమతులు, లేఅవుట్లు, మార్పులు ఇవన్నీ రాత్రి వేళల్లోనే చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి….పగలు నియమాలు… చీకటి ఒప్పందాలు…అనే పరిస్థితి నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
పర్యవేక్షణ పేరిట..చీకటి పన్నగాలు..
ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ అధికారులు “పర్యవేక్షణ” పేరిట రాత్రివేళల్లో బయటికెళ్లి కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు చూపిస్తున్నా… వాస్తవానికి అది కేవలం ఓ ముసుగు మాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణ పేరుతో పన్నాగాలు… అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు

అధికారిక సమయం ముగిశాక అనధికార సమావేశాలు..
ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కార్యాలయంలో ఈ సమావేశాలు ఎందుకని?
అధికారిక పనులు అయితే గోప్యత ఎందుకని?
భూ వ్యాపారులతో రాత్రివేళల్లో జరిగే చర్చల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని?
ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. నమ్మకం కోల్పోతే… అధికార ఘనం పై నమ్మకం కూలిపోతుంది అనే హెచ్చరికను అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజలకు న్యాయం జరిగే స్థలం కావాలి గానీ… చీకటి ఒప్పందాలకు కేంద్రంగా మారకూడదు. కోరుట్లలో జరుగుతున్న ఈ వ్యవహారం నిజమైతే, అది కేవలం ఒక కార్యాలయానికి సంబంధించిన సమస్య కాదు.మొత్తం పరిపాలన వ్యవస్థపై మచ్చ వేస్తుంది.

