విధి వంఛితమా.. కర్తవ్య భారమా…?
కన్నీటి గాథలతో కానరాని లోకాలకు
ఎస్సై దంపతుల ఆత్మహత్యకు కారణాలేంటి..
వ్యవస్థలో ఒత్తిడి పని భారం సర్వసాధారణం..
రణం న్యూస్ డెస్క్: మార్చి 21
(ఎడిటర్.. ఆకుల మల్లికార్జున్)
కరీంనగర్ లో ఎస్సై చంద్రశేఖర్ దంపతులకు నివాళులర్పిస్తూ…వాళ్ల బలవన్మరణం , మరొకరి జీవితాన్నికాపాడేమార్గంగా మారాలికానీ వాళ్ల కథ ఇంకొకరికి ముగింపు మాత్రం కాకూడదు…
ఒక క్షణపు చీకటి కోసం జీవితాన్నంతా మసకబార్చొద్దు…నీ గుండెల్లో దాచుకున్న బాధ కన్నీటిగా బయటపడితేనే తేలిక అవుతుంది.
నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ముగిసేది సమస్య కాదు… మిగిలేది నిన్నునమ్ముకున్న వాళ్ళకి అంతులేని బాధ.నువ్వు ఊపిరి తీసుకుంటున్నంత వరకు ఆశ కూడా బ్రతికే ఉంటుంది.ఆత్మహత్య కాదు సమాధానం పోరాడి నిలబదటమే మార్గదర్శనం…
వ్యవస్థలో మనుషులు మనసులు మారాల్సిన..మార్చాల్సిన పరిస్థితులు క్షణికావేశానికి లోనుకావద్దు…బాధలు ఎన్నున్నా భరించే శక్తిని పెంచుకోవాలి కానీ ప్రాణాల్ని చేతులారా త్యజించుకోవద్దు..ఎందరికో బిగ్గరగా అరిచి చెప్పాలనే నిశ్శబ్ద అరుపులు ఎన్నో ఉంటాయి… కానీ ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కార మార్గాలు కావు. బ్రతికిసాధించాలి కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దు అని సమాజం కోరుకుంటున్నది.
కన్నీటి గాథలతో కానరాని లోకాలకు
ఆ కళ్ళలో చిక్కుకున్న కన్నీటి గాథలు… విధి పట్ల అచంచల నిబద్ధతతో జీవించిన ఒక అధికారి ఆయన భార్య జీవితాంతం ఎదుర్కొంటున్న సమస్యలు.. చివరికి ఆ బాధలనే భరించలేక శాశ్వతంగా కానరాని లోకంలోకి నిశ్శబ్దంగా జారుకున్న విషాద సంఘటన..ఎస్సై చంద్రశేఖర్ దంపతుల ఆత్మహత్య రాష్ట్రాన్ని కలచివేసింది.

కర్తవ్యమే పరమావధిగా సాగి…….
కర్తవ్యమే జీవన విధిగా తీసుకున్న చంద్రశేఖర్, రోజువారీ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడులు, పైస్థాయి నుంచి వచ్చే కఠిన ఆదేశాలు, సామాజిక బాధ్యతల మధ్య తన్నుతాను కోల్పోతూ పోయాడనే భావన సహచరుల్లో వ్యక్తమవుతోంది. చట్టాన్ని నిలబెట్టే బాధ్యత భుజాన వేసుకున్న ఒక పోలీస్ అధికారి, తన మనసులో పేరుకుపోయిన వేదనకు సమాధానం కనుగొనలేకపోవడం ఎంత దురదృష్టకరం…
వ్యవస్థలో ఒత్తిడి భారం కూడా కారణమే..
“గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు…” అన్నట్టుగా, తనలోని ఆవేదనను బయటపెట్టలేక మౌనంగా మిగిలిపోయాడు చంద్రశేఖర్. అతని పక్కనే నడిచిన జీవిత భాగస్వామి తన కళ్ళ ముందే కనుమరుగై పోయాక అదే బాధను పంచుకుంటూ చివరి ప్రయాణంలో తోడై వెళ్ళాడు…. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబం కోల్పోయిన ప్రాణాలు మాత్రమే కాదు..వ్యవస్థలోని ఒత్తిళ్లు, మనుషుల మనసులపై పడే భారాన్ని బలంగా గుర్తుచేసే దుర్ఘటన.
రాజీ పడని అధికారి గా గుర్తింపు….
సహచరులు చెబుతున్నదేమిటంటే చంద్రశేఖర్ కఠినతతో పాటు మానవత్వాన్ని కలిపిన అధికారి. ప్రజల సమస్యలపై స్పందించే హృదయం, విధి నిర్వహణలో రాజీపడని ధైర్యం… ఇవన్నీ ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత పోరాటంలో మాత్రం ఒంటరితనాన్ని తట్టుకోలేక తనువు చాలించాడు..
పోలీస్ వృత్తిలో మానసిక వేదనలు తగ్గాలి….
ఈ విషాదం పోలీస్ వ్యవస్థలో మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. బాధ్యతలతో నిండిన వృత్తిలో పనిచేసే వారికి సముచితమైన విశ్రాంతి, మానసిక బలపాటు, భావోద్వేగ సహాయం ఎంత అవసరమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది.

