భూసమస్యల పరిష్కారమే
భూభారతి చట్టం…
రైతు భూములకు పూర్తి భరోసా…
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ….
రణం: న్యూస్ భీమారం:ఏప్రిల్ 19,..రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
శనివారం రోజున జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొని చట్టం గురించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం ప్రకారం ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ భూభారతి చట్టంలో మ్యుటేషన్లు ఆటోమేటిక్ గా అవుతాయని ,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. భూ భారతి అంశాలను రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి దివాకర్ రెడ్డి. భీమారం తాసిల్దార్ రవి కిరణ్, రైతులు,ప్రజలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
