రణం న్యూస్ మెట్ పల్లి, ఏప్రిల్ 9: క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది విద్యుత్ ప్రమాదాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని లైన్ లలో పనిచేస్తున్నపుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని తమ ప్రాణాలను రక్షించుకోవాలని మెట్ పల్లి డీఈ గంగారాం అన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నూతనంగా ఆవిష్కరించిన ఎల్.సీ- యాప్ ( లైన్ క్లియరెన్స్- అప్లికేషన్) పై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు మెట్ పల్లి లో బుధవారం నిర్వహించి సిబ్బందికి ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ నిచ్చారు.
గతంలో ఒక ఫీడర్ పై పని చేయాలంటే సంబంధిత సబ్స్టేషన్ ఆపరేటర్ ను ఫోన్ లో సంప్రదించి క్షేత్ర స్థాయి సిబ్బంది లైన్ క్లియరెన్స్ తీసుకునేవారు. ఒక ఫీడర్ కు బదులు మరో ఫీడర్ బందు చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటినీ అధిగమించడానికి ఎల్సీ యాప్ ద్వారా సిబ్బంది రిక్వెస్ట్ పెడితే ఆ ఫీడర్ పై చేయబోయే పని ఏమిటి, ఎంత సమయం బందు చేయాలి, ఆ ప్రదేశం ఫొటో అప్ లోడ్ చేస్తే, ఆ ఫీడర్ మొదలయ్యే సబ్స్టేషన్ ఆపరేటర్ బ్రేకర్ ట్రిప్ చేసి, ఐసోలేటర్ తెరిచిన ఫోటో అప్ లోడ్ చేస్తే పనికి ఉపక్రమించా లన్నారు. ఆ ఫీడర్ కింద మరేదైనా ఫీడర్ అడ్డంగా వెళ్తే ఆ రెండవ ఫీడర్ ను బందు చేస్తారని, ఆ ఫీడర్ పోయే మార్గంలో లైన్ ల మధ్య నిడివి లేని స్థానాలు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పని ఆ సెక్షన్ లో పని చేసే సిబ్బంది అందరూ భాగస్వాములై,జట్టు స్పూర్తితో బాధ్యతగా పని చేస్తారు. లైన్ క్లియరెన్స్ గంట కంటే ఎక్కువ సమయం కోరితే ఏఈ అనుమతి తీసుకోవాలన్నారు. ఈ యాప్ సమర్థ నిర్వహణకు సబ్స్టేషన్ లకు ఆండ్రాయిడ్ ఫోన్ లు సరఫరా చేస్తామని డీఈ గంగారాం తెలిపారు. ప్రతీ విపత్తు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లైన్ బందు చేయబడుతుందన్నారు. చీటికి మాటికి, ఎవరు పడితే వారు ఫీడర్ బందు చేయరాదన్నారు. తద్వారా విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయి. ఇక నుండి ఏ ఒక్కరి ప్రాణహాని లేకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లైన్ ల నిర్వహణ పనులు చేయాలని, ప్రమాదాలను సున్నా స్థాయికి తీసుకురావడమే విద్యుత్ సంస్థ లక్ష్యమని డీఈ గంగారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ లు మనోహర్, హరీష్, అంజన్ రావ్, రఘుపతి, ఏఈ లు, సబ్ ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి సిబ్బంది 200 మంది పాల్గొన్నారు.

