ఉద్రిక్తతలతో ఇరాన్ అమెరికా ఆందోళనలో ప్రపంచం
స్తంభించిన జనజీవనం…ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు
యుద్ధ భయంతో భారతీయ కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన
రణం న్యూస్ డెస్క్: మార్చి 10,
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒక వైపు ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే, మరో వైపు అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే క్రమంలో ప్రతిస్పందిస్తోంది. ఈ శక్తి ప్రదర్శనల మధ్య అసలు నష్టపోయేది మాత్రం సాధారణ ప్రజలే. రాజకీయ నాయకుల నిర్ణయాలు, సైనిక వ్యూహాలు చివరికి పేద ప్రజల జీవనాన్ని చీల్చి వేస్తున్నాయి.
యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక సంక్షోభం
కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో అస్థిరత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం భారంతో ఇబ్బందులు పడుతున్న దేశాలకు ఇది మరో సవాలుగా మారుతోంది. యుద్ధం వల్ల వాణిజ్య మార్గాలు దెబ్బతింటే దిగుమతులు, ఎగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధం మరింత విస్తరించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాంతి చర్చల ద్వారానే ఈ సంక్షోభాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యుద్ధం అనే పదం కేవలం సరిహద్దుల్లో జరిగే కాల్పులకే పరిమితం కాదు. అది ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తుంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, లక్షలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేస్తుంది. ఇరాన్,అమెరికా మధ్య ఉద్రిక్తత పెరిగితే దాని ప్రభావం మధ్యప్రాచ్య దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది. చమురు ధరలు పెరగడం, వాణిజ్య మార్గాలు దెబ్బతినడం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి పరిణామాలు సాధారణ ప్రజల జీవనాన్ని మరింత కఠినతరం చేస్తాయి.
విదేశాల్లో ఉన్న భారతీయ కుటుంబాల ఆందోళన…
ఈ పరిణామాలు భారతదేశానికీ దూరం కావు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది భారతీయ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. కుటుంబాలను పోషించేందుకు విదేశాలకు వెళ్లిన వారు యుద్ధ భయంతో గుబులు పడుతున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ప్రతి వార్తను ఆందోళనతోనే చూస్తున్నారు. ఒకవేళ యుద్ధం విస్తరించినట్లయితే ఉద్యోగాలు కోల్పోవడం, దేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి రావడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఆధిపత్య పోరులో మానవత్వం కు చోటులేదు
అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తి పోరు కొత్త విషయం కాదు. కానీ ప్రతి యుద్ధం మనకు ఒకే గుణపాఠం చెబుతుంది ఆధిపత్యం కోసం జరిగే పోరాటాల్లో మానవత్వం ఓడిపోతుంది. రాజకీయ లాభనష్టాల కంటే ప్రజల ప్రాణాలు, వారి భవిష్యత్తు ముఖ్యమని ప్రపంచ నాయకులు గుర్తించాల్సిన సమయం ఇది.
శాంతి కోసం చర్చలే మార్గం..
.ప్రపంచ శాంతి కోసం సంభాషణే మార్గం. ఆయుధాల గర్జన కంటే చర్చల స్వరం బలంగా వినిపిస్తేనే మానవ సమాజం రక్షితంగా ఉంటుంది. లేకపోతే యుద్ధాల కథలు చరిత్ర పుస్తకాలలోనే కాదు, సాధారణ కుటుంబాల కన్నీళ్లలో కూడా కొనసాగుతూనే ఉంటాయి.

