
- ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు
- రెండు లక్షలపైనే హాజరవుతారని అంచనా
- ఇంటికి ఇద్దరు రావాలంటూ పిలుపు
- రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రానున్న బీసీలు
- అన్ని దారులూ వరంగల్ వైపు
- నేషనల్ మీడియా సైతం స్పెషల్ ఫోకస్
రణం న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : వరంగల్ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న మధ్యాహ్నం నిర్వహించనున్న బీసీ రాజకీయ యుద్ధభేరికి సర్వం సిద్ధం అయింది. రాజ్యాధికారమే లక్ష్యంగా కదంతొక్కుతున్నారు. స్థానికం నుంచి స్టేట్, సెంట్రల్ వరకు తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు. అయితే రాష్ట్రం నలుమూలలనుంచి బీసీలు అధిక సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ నేతలంతా అశీనులయ్యేందుకు వీలుగా పెద్ద స్టేజీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కనీసం ఇద్దరు సభకు హాజరు కావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో అంచనాకు మించి బీసీలు తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు.
ఒకటే కులం..
జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురికావడంపై బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం బీసీల్లో ఉన్న వేర్వేరు కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకున్నారని ఇక ముందు చెల్లదంటున్నారు. ఇప్పుడు మాదంతా ఒకటే కులం.. అదే బీసీ కులం అంటున్నారు. రానున్న రోజుల్లో బీసీల ఐక్యతతో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. ఇకపై ఓట్లు మావే..సీట్లూ మావేనంటున్నారు.
గర్జిస్తున్న బీసీలు..
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో సైతం 50శాతం సీట్లు కేటాయించాలంటున్నారు. అదే విధంగా బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలంటున్నారు. జనాభాలో 6.2 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీసీల రక్షణకోసం అట్రాసిటీ చట్టం తేవాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీ-యింబర్స్ మెంట్ కల్పించాలని, చేతి కుల వృత్తులను పరిశ్రమలుగా గుర్తించి ప్రోత్సహించాలని, నిరుపేద బీసీలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్ని దారులు వరంగల్ వైపే..
రాష్ట్రంలోని అన్ని దారులు వరంగల్ వైపే సాగుతున్నారు. బీసీలంతా ఒక్కటై తమ సత్తా చాటేందుకు ఏర్పాటు చేసిన బీసీ రాజకీయ యుద్ధభేరిలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందుకుగాను హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం ముస్తాబైంది. సభా ప్రాంగణమంతా పెద్ద పెద్ద హోర్డింగులతో నిండుకుంది. దారి పొడుగునా పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. పట్టణాలు, పల్లెలు హలో బీసీ..చలో వరంగల్ అంటూ నినదిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీసీ నేతలు వరంగల్ లో మకాంవేసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో తరలివచ్చే బీసీలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్పెషల్ ఫోకస్..
బీసీలంతా ఒకే తాటిపైకి వచ్చామంటూ ప్రకటిస్తున్నారు. ఈ సభ ఒక్క తెలంగాణకే కాదు యావత్ భారతదేశంలో కూడా ఓ విప్లవం తీసుకురాబోతున్నదంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు పోలీసు అధికారులు సహాయసహకారాలు అందించాలని కోరుతున్నారు. అయితే భారీ అంచనాలతో ఏర్పాటు చేసిన ఈ సభపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతోపాటు నేషనల్ మీడియా సైతం ఫోకస్ పెట్టింది. బీసీల్లో వచ్చిన చైతన్యాన్ని చూసేందుకు వారు కూడా వరంగల్ దారి పడుతున్నారు.