

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,డిఎస్పీ రాములు తెల్లవారే వరకు సంఘటన స్థలం లోనే
రణం న్యూస్ కోరుట్ల,జులై 5
ఆ చిన్నారి అభం శుభమ్ తెలియనిది… అదిగో పులి అంటే ఉలిక్కిపడి బెంబేలెత్తే పసి వయసు… ముక్కు పచ్చలారని ముద్దులొలికే అమ్మానాన్నల పసిడిపంట… తెలంగాణ సంప్రదాయ పండుగలలో పీర్ల పండగ పెద్దపులుల వేషధారణకు చాలా ప్రాచుర్యం ఉంది.పిల్లలు .. యువకులు … కేరింతలు కొడుతూ చిందులేస్తుంటారు… కానీ ఆ సంబరమే చిన్నారి పాలిట యమపాశం అయింది.
వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఐదు ఏళ్ల చిన్నారి ఆకుల హితిక్ష అనుమానాస్పద మృతి పలువురి హృదయాల్ని కలిచి వేసింది.. హితిక్ష అమ్మ నాన్నలకు రెండవ సంతానం.తండ్రి రాము వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లి కుటంబ పోషణ చేస్తుంటాడు.తల్లి నవీనగృహిణి..పీర్ల పండగ నేపథ్యం లో పెద్దపులుల వేశధారణతో వాడ వాడ లో సందడి అంత ఇంత ఉండదు.ఆ కొలహాలమే అమ్మ నాన్నల బంగారు పట్టిని బలిగొన్నది. ఆ సంబరమే ఆ పసికందు పాలిట శాపమైంది. విచక్షణ రహితంగా గొంతు కోసి హత్యకు గురి అయిన సంఘటన సంచలనం రేకెత్తించింది.
పాప కనిపించడం లేదు .. ఆచూకీ తెలపండి…L
సాయంత్రం సమయం లో తమ పాప హితిక్ష గంట నుండి కనిపించడం లేదు ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ చక్కర్లు కొట్టింది.. ఆ తరువాత కొంత సమయం తర్వాతనే ఆ చిన్నారి చనిపోయిందంటు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫొటోలు రావడం ఒక్కసారిగా కోరుట్ల పట్టణం ఉలిక్కిపడేలా చేసింది.ఆ పాప తమ ఇంటి దగ్గర లో ఉన్న బాత్రూమ్ లో మెడ భాగం తెగిపోయి రక్తపు మడుగులో పడి ఉండటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
విచారణ చేస్తున్న పోలీసులు:
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,మెటపల్లి డిఎస్పీ అడ్లూరి రాములు, కోరుట్ల మెటపల్లి సి ఐ లు సురేష్ బాబు,అనిల్ కుమార్ లు కోరుట్ల కథలపూర్ మేడిపల్లి మెటపల్లి ఎస్ ఐ లు చిరంజీవి,నవీన్,శ్యామ్ రాజ్,కిరణ్ కుమార్ విచారణ ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఈ అమానుష అమానవీయ ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది. పాప తల్లిదండ్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని పాశవికంగా హత్యచేసిన మానవ మృగం ఎవరు,హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు డాగ్ స్కాడ్ , ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇలాంటి అమానుష ఘటనలు హత్యలు పట్టణంలో తరుచూ జరుగుతుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.