
- బడా బకాయిదారులపై దృష్టి సారించండి
- బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
- ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్ష
రణం న్యూస్, వరంగల్ బల్దియా : బడా పన్ను బకాయిదారులపై ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో పన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వాన్ని వీడి ప్రణాళిక బద్ధంగా సమగ్ర కార్యాచరణ రూపొందించుకొని పన్ను వసూళ్లు చేయాలన్నారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల లక్ష్యం రూ.11621.26 లక్షలు కాగా ఇప్పటివరకు రూ.4511.32 లక్షలు అనగా 39 శాతం, నల్లా పన్ను వసూళ్ల లక్ష్యం రూ.6688.02 లక్షలు కాగా రూ.1084.66 మాత్రమే వసూలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు షహజాది బేగం, శ్రీనివాస్, యూసుఫోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించాలి..
గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత విభాగ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, ఏసీపీలు శ్రీనివాస్ రెడ్డి, రజిత, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం..
క్రీడల్లో గెలుపోటములు సహజమని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయ పడ్డారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా పరిధిలోని కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు, మీడియా, అధికారులు, సిబ్బందికి క్రికెట్, షటిల్, క్యారమ్స్, చెస్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.