పార్టీని కన్నతల్లి లా భావిస్తే…పొమ్మనలేక పొగబెట్టారా…
నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ తో పయనం.. నేడే కటీఫ్
రణం న్యూస్ డెస్క్: మార్చి 25.
(ఎడిటర్. ఆకులమల్లికార్జున్)
జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్.. అంటే జీవన్ రెడ్డి… నలభై సంవత్సరాల నుండి ఈరోజు వరకు పార్టీ కన్నతల్లి లా నమ్మాడు..కానీ ఆ పార్టీ లోని నాయకులే తనను అవమానాలకు గురిచేస్తుంటే ప్రశ్నించాడు..పార్టీ అధికారం లో ఉన్నా లేకున్న వీడకుండా క్యాడర్ ను కాపాడుకున్నాడు.. అలాంటి నాయకుడు నేడు పార్టీ వీడిపోతున్నాడు..సీనియర్ నాయకుడు పార్టీని వీడితే, అది కేవలం ఒక వ్యక్తి పార్టీ ని వీడినట్లు కాది ఒక శక్తి ని దూరం చేసుకుంట్లే..ఈయన కాంగ్రెస్ పార్టీకి భారీ నైతిక దెబ్బగా మారే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు పార్టీకి అంకితమైన నాయకుడి మనోభావాలను గౌరవించకపోతే, ఇతర నేతల్లో కూడా అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. నేడే పార్టీ కి ముఖ్య కార్యకర్తల సమావేశం లో పార్తికి రాజీనామా చేసే అవకాశం మెండుగా ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన నాయకుల్లో తాటిపర్తి జీవన్ రెడ్డి పేరు ముందుంటుంది. నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఈ సీనియర్ నేత, ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా పార్టీని “కన్నతల్లి”గా భావించి కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అవమానాల మంటల్లో కాగిపోతూ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన జీవన్ రెడ్డి, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే తన ధ్యేయంగా తీసుకున్న ఆయనను ఎన్నోసార్లు ప్రత్యర్థి పార్టీల నుంచి ఆహ్వానాలు, ప్రలోభాలు చుట్టుముట్టినా ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. రాజకీయాల్లో విలువలు, విశ్వాసం ఉంటే అవే తన బలం అన్న నమ్మకంతో ముందుకు సాగారు.కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయనకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ వ్యవహారాల్లో బిఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, సీనియర్లను పక్కనబెట్టడం వంటి పరిణామాలు జీవన్ రెడ్డి వంటి నేతలకు అవమానకరంగా మారుతున్నాయని అంటున్నారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిని విస్మరించడం కేవలం వ్యక్తిగతంగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ మూల్యాలకే విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
“పొమ్మనలేక పొగబెడుతున్నారా?” అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వేదికలపై గట్టిగా మార్మోగుతోంది. ప్రత్యక్షంగా వెళ్లమని చెప్పకుండా, పరోక్షంగా అవమానాలు, నిర్లక్ష్యం చూపిస్తూ పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నిబద్ధతతో పని చేసిన సీనియర్ నేతను గౌరవించలేకపోతే, పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు తలెత్తుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

