ప్రజల్లోంచి వచ్చిన నాయకులంటే ఎందుకంత చిన్నచూపు…
కార్యకర్త నాయకుడైతే ఓర్వలేని పరిస్థితి….
రణం న్యూస్ డెస్క్: మార్చి15
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
రాజకీయాలు అనేవి ప్రజాసేవ కోసం ఉన్న వేదికలు. కానీ ఈ రోజుల్లో రాజకీయాలంటే డబ్బు, ప్రభావం, అధికారంతో మాత్రమే సాధ్యమనే భావన పెరుగుతోంది. డబ్బు ఉన్నవాళ్లే రాజకీయాల్లో నిలబడగలరనే అభిప్రాయం బలపడుతోంది. అయితే ప్రజల్లోంచి వచ్చిన, కష్టపడి ఎదిగిన కార్యకర్తలను చూసినప్పుడు కొంతమంది ఓర్చుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయం.
కార్యకర్తనే పార్టీకి వెన్నుముక
పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలు ఉంటారు. సభలు, సమావేశాలు, ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఒక్కో మెట్టుగా ఎదిగి నాయకులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని చూసి ప్రోత్సహించాల్సిన బదులు, వారిని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో డబ్బు ముఖ్యమైందే అయినా, ప్రజల విశ్వాసం అంతకంటే ముఖ్యమైనది. ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను అర్థం చేసుకునే నాయకుడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తి కార్యకర్త స్థాయి నుండి ఎదిగితే అతనిపై ప్రజల్లో సహజంగానే నమ్మకం పెరుగుతుందిఅదే కొందరికి అసహనంగా మారుతోంది.ప్రజాస్వామ్యంలో నాయకత్వం సంపాదించేది సంపదతో కాదు, సేవతో. ప్రజల కష్టాలు తెలుసుకుని వారి కోసం పోరాడే వ్యక్తే నిజమైన నాయకుడు అతను ఎంత సాధారణ కుటుంబం నుంచి వచ్చినా ప్రజల మద్దతు ఉంటే అతడే ప్రజల నాయకుడు అవుతాడు.
ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న సమాజంలో వినిపిస్తోంది. రాజకీయాలు డబ్బు ఉన్నవాళ్లకే పరిమితమా? లేక ప్రజల్లోంచి పుట్టిన నాయకులకు కూడా సమాన అవకాశాలు ఉండాలా? ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాధానం స్పష్టమే. ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడే ప్రజల హృదయాలను గెలుచుకుంటాడు*
నిబద్ధతతో పనిచేసి దేశాన్ని ఏలిన కార్యకర్తలు ఉన్నారు…
గ్రామస్థాయి మొదలుకొని మండలం పట్టణ జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలో కార్యకర్త స్థాయి నుండి దేశాధినేతలని మనం చూశాం.. ఇప్పటికి కొన్ని రాజకీయ పార్టీల్లో చూస్తున్నాం…కానీ కింది స్థాయి నుండి ఎదిగిన నాయకులను చూస్తే అసలు గిట్టనివారిని అంతకు పదిరెట్లు నాయకులను చూస్తున్నాం..
రాజకీయాల్లో డబ్బు ప్రామాణికం కాదు..
ఇప్పటికైనా రాజకీయాల్లో డబ్బు కన్నా సేవకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోంచి వచ్చిన నాయకులను ప్రోత్సహిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే రాజకీయాలు కొందరి చేతుల్లో మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

