ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేడుకోలు
మెటపల్లి ఏరియా హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
జిల్లాలోని జగిత్యాల కోరుట్ల రాయికల్ తో పాటు ఇదే శాఖలో ఇతర విభాగాల్లో ఇదే పరిస్థితీ

రణం న్యూస్ మెటపల్లి: సెప్టెంబర్ 19
జగిత్యాల జిల్లా మెటపల్లి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తూన్న పొరుగు సేవల ఉద్యోగులు తమకు ఏడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ శుక్రవారం మెటపల్లి ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఆకస్మికంగా నిరసన కార్యక్రమములో పాల్గొన్న పొరుగు సేవల సిబ్బంది మాట్లాడుతూ కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం వేతనాలు చెల్లించకపోవడం ఎంతో విచారకరమన్నారు. నామమాత్రపు జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.
నెలనెలా వారి కుటుంబ సభ్యుల ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల పాఠశాలల ఫీజులు వంటి అనేకమైన సమస్యలు తమను వెంటాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్ల ప్రభుత్వం కనికరం చూపించకపోవడం అన్యాయమని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలనే యోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని వారు హితవు పలికారు. వెంటనే ఔట్ సోర్సింగ్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శాఖలో కోరుట్ల రాయికల్ జగిత్యాల ఏరియా హాస్పిటల్ లలో,ఇతర విభాగాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేక చాలాఇబ్బందులేదుర్కొంటున్నట్లు సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నారు

