రణం న్యూస్, మేడిపల్లి మండలం, సెప్టెంబర్ 15:

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పోరుమల్ల గ్రామంలో ఇటీవల జరిగిన చెట్ల నరికివేత సంఘటనపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి లో పోరుమల్ల గ్రామానికి చెందిన మాదం మహేష్ ఫిర్యాదు పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు నేరుగా అందజేశారు. గ్రామ జడ్పీహెచ్ఎస్ ముందర ఉన్న పంచాయతీరాజ్ శాఖ, బీటి రోడ్డు పోరుమల గ్రామం నుంచి జగిత్యాల వెళ్లే రోడ్డు మార్గంలో 20 కి పైగా చెట్లను కోతులు, పక్షులు, పాముల బెడద ఉందనే సాకుతో రంపపూ వేటు తో చెట్లను నరికి లోడ్ చేసుకొని కొందరు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. రోడ్డు వెంబడి ప్రయాణించే వారికి, ఐకెపి కేంద్రానికి వచ్చే రైతులకు, వాహనదారులకు, గ్రామ ప్రజలకు నీడ లేకుండా చేస్తున్నారని. ఈ విషయంపై గ్రామ ప్రజలకు తెలియకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా చెట్లను నరికి వేయడం జరిగిందని పేర్కొన్నారు. చెట్లు నరికి వేయడం కూడా అభివృద్ధి అంటూ గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అన్నారంటూ పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనం ప్రక్కన ఉన్న చెట్లను అయినా కాపాడాలని, ఇట్టి సంఘటనకు కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

