స్థిరత్వం నుంచి క్షీణత వైపు..
డింక్’ సంస్కృతి: మారుతున్న పట్టణ జీవనం …
వ్యాసకర్త..ఆరోగ్య బోధకులు సైకాలజి కౌన్సిలర్ కటకం శంకర్..
రణం న్యూస్ డెస్క్: జనవరి7
( ఎడిటర్ ::ఆకుల మల్లికార్జున్)
దశాబ్దాల పాటు ‘జనాభా విస్ఫోటనం’ అనే పెనుముప్పుతో పోరాడిన భారతదేశం, ఇప్పుడు సరికొత్త సామాజిక సంక్షోభం అంచున నిలుచుంది, ఒకప్పుడు ఏటా పెరుగుతున్న జనాభాను చూసి ఆందోళన చెందిన దేశం, నేడు వేగంగా తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటును చూసి పునరాలోచనలో పడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) గణాంకాలు భారత జనాభా ముఖచిత్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతున్నాయి. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావు.. భవిష్యత్తులో రాబోయే సామాజిక, ఆర్థిక తుపానుకు హెచ్చరిక సంకేతాలు,
స్థిరత్వం నుంచి క్షీణత వైపు..
జనాభా శాస్త్రం ప్రకారం, ఒక దేశం లేదా రాష్ట్రం తన జనాభాను స్థిరంగా ఉంచుకోవాలంటే మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) కనీసం 2.1 ఉండాలి. దీనినే ‘రీప్లేస్మెంట్ లెవల్’ అంటారు. అయితే, భారతదేశ సగటు ప్రస్తుతం 2.0 కి పడిపోయింది, మొదటి నుంచి జనాభా నియంత్రణలో ముందంజ లో ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో TFR 1.8కి పడిపోయింది. విచిత్రమేమిటంటే, సాధారణంగా పట్టణాల్లో తక్కువగా ఉండే ఈ రేటు, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో (1.7) పట్టణాల (1.8) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇది ఆరోగ్య సేవల లభ్యతను సూచిస్తుంది. గ్రామీణ తెలంగాణలో ఎ. ఎన్. ఎం లు, ఆశా కార్యకర్తలు మెరుగైన సేవలు అందిస్తున్న విషయాన్ని సూచిస్తుంది.
ఇక పునరుత్పత్తి రేటు (Net Reproductive Rate) 1.0 కంటే తగ్గడం అంటే, ఒక తల్లి తన స్థానంలో మరొక ఆడబిడ్డను భర్తీ చేయలేకపోతోందని అర్థం. ఇది ప్రస్తుతానికి అభివృద్ధిలా అనిపించినా, దీర్ఘకాలంలో Demographic Winter వైపు మనల్ని నెడుతోంది. యువశక్తి క్రమంగా తగ్గి, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల దేశ ఆర్థిక ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉంది.
కెరీర్ కోసం… మానవత్వానికి దూరం
మహిళా విద్య, ఉపాధి రంగాల్లో వస్తున్న మార్పులు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. “ముందు కాళ్ల మీద నిలబడాలి.. ఆ తర్వాతే సంసారం’ అన్న ధోరణి నేటి యువతుల్లో బలంగా కనిపిస్తోంది. ఉన్నత చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వేటలో వివాహ వయసు ముప్పై ఏళ్లకు చేరుతోంది. ఒకప్పుడు 20 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కే సంప్రదాయం పోయి, ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ పడిపోకూడదనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు మాతృత్వాన్ని వాయిదా వేస్తున్నారు. ఆర్థిక స్వాలంబన మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మాట వాస్తవమే అయినా, అది జనాభా సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
‘డింక్’ సంస్కృతి: మారుతున్న పట్టణ జీవనం:-
ప్రస్తుత తరం పట్టణ జీవనశైలిలో ‘డింక్’ (DINK Double Income, No Kids) అనే సరికొత్త సంస్కృతి వేళ్లూనుకుంటోంది, భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తారు.. కానీ పిల్లలు వద్దనుకుంటారు. విలాసవంతమైన జీవితం, బాధ్యతలు లేని స్వేచ్ఛ, ఖరీదైన పర్యటనలు ఈ సంస్కృతికి పునాదులు, సంతానాన్ని పెంచడం ఒక భారంగా, కెరీర్‌కు ఆటంకంగా భావించే ధోరణి పెరుగుతోంది. NFHS-5 ప్రకారం, తెలంగాణలో ‘వాంటెడ్ ఫెర్టిలిటీ రేటు’ కేవలం 1.6గా ఉండటం అంటే, ప్రజలు మనస్పూర్తిగా కోరుకునే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

కటుకం శంకర్
సమాజం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా, పురాతన రుగ్మతలు ఇంకా వీడటం లేదు. గర్భస్థ లింగ నిర్ధారణను నిరోధించే పిసీ పీఎన్డీటీ (PCPNDT) చట్టం కఠినంగా అమల్లో ఉన్నప్పటికీ, లోపాయికారిగా అక్రమ పరీక్షలు సాగుతూనే ఉన్నాయి. స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లో అంతారం పెరిగింది, కుమారుడు పుడితేనే వంశం నిలుస్తుంది’ అనే అపోహ ఇంకా బలంగా ఉంది. తెలంగాణ గణాంకాల ప్రకారం.. ఇద్దరు ఆడపిల్లలున్న తల్లుల్లో కేవలం 80 శాతం మంది మాత్రమే కుటుంబ నియంత్రణ పాటిస్తుండగా, ఒక్క కుమారుడు ఉన్నవారిలో ఆ సంఖ్య 93 శాతానికి చేరడం గమనార్హం. అంటే, కుమారుడు పుట్టే వరకు సంతానాన్ని కొనసాగించే ధోరణి నేటికీ మరుగున పడలేదు. ఇది లింగ నిష్పత్తిని దెబ్బతీస్తూ, సమాజంలో సమతుల్యతను అస్తవ్యస్తం చేస్తోంది.
ముంచుకొస్తున్న వృద్ధాప్య భారం…
ఐక్యరాజ్యసమితి ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్-2023′ ప్రకారం, 2046 నాటికి దేశంలో 15 ఏళ్లలోపు పిల్లల కంటే 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్యే అధికం కానుంది. 2050 నాటికి ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు వృద్ధులే ఉంటారు. జపాన్, ఇటలీ వంటి దేశాలు నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనం రేపు భారత్‌కు, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలకు తప్పేలా లేదు. జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరిగి, శ్రామిక శక్తి తగ్గడం వల్ల అక్కడి జీడీపీ కుంటుపడింది. మన దేశంలోనూ అదే పరిస్థితి తలెత్తితే, పెన్షన్లు మరియు వృద్ధాప్య ఆరోగ్య సేవలు, పాలియేటివ్ సేవలు వంటి వైద్య సేవల కోసం ప్రభుత్వం తన బడ్జెట్లో సింహభాగాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కొందరు నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’ అని పిలుపునివ్వడం వెనుక లోతైన ఆర్థిక విశ్లేషణ ఉంది.
సమగ్ర ప్రణాళికే శరణ్యం..
భారతదేశం ‘జన విస్ఫోటనం’ గండం నుంచి బయటపడటం ఊరటనిచ్చే విషయమే, కానీ, అది ‘జన క్షీణత’ అనే అగాధంలోకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది, జనాభా స్థిరీకరణ అవసరమే, కానీ అది రేపటి తరం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉండకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణ, లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ, మహిళా విద్య, మహిళ సాధికారత, నైపుణ్యాభివృద్ధి పై దృష్టి సారించడంతో పాటు, మారుతున్న జనాభా ముఖచిత్రానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు రచించాలి.
వృద్ధుల సంరక్షణ, యువతకు ఉపాధి కల్పన, మరియు పిల్లల పెంపకానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం సమాంతరంగా సాగాలి. లేని పక్షంలో పిల్లల్ని కంటే ఇంక్రీ మెంట్లు, పిల్లల్ని కనేందుకు సెలవుల మంజూరు వంటి కార్యక్రమాలను అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే మహిళలు కెరీర్ మరియు కుటుంబం మధ్య సమతుల్యతను సాధించేలా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లేదా ‘డే-కేర్’ సెంటర్ల వంటి సదుపాయాలను కల్పించాలి. అప్పుడే ‘వికసిత భారత్’ కల అయిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ అయిన సాకారమవుతాయి, లేదంటే, యువ శక్తి మరుగై, వృద్ధాప్య భారంతో భారత దేశం కునారిల్లే ప్రమాదం ఉంది. మేధావులు, పాలకులు మేల్కొని భవిష్యత్తు తరాల మనుగడకు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.

